7.4.17

పాని పూరీ (గోల్ గప్పె) Pani puri (Golgappe)

పాని పూరీ (గోల్ గప్పె)   Paani Puri (Golgappe) 


కావలసిన పదార్థాలు:- 
బొంబాయి రవ్వ (గోధుమనూక) - 1 కప్పు
మైదాపిండి - 2 స్పూన్స్
అప్పడాల షోడా - 1/4 స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 1/4 కేజీ

తయారీవిధానం:-
ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులో బొంబాయి రవ్వ, మైదాపిండి, ఉప్పు, అప్పడాల షోడా అన్నీ వేసి, కొంచెంగా గోరువెచ్చని నీరు పోసి, పూరి పిండి మాదిరిగా కలపాలి. పిండిని బాగా కలిపి, ఒక తడిబట్ట కప్పి, 30 నిముషాలు పక్కనపెట్టి నాననివ్వాలి. పిండి నానిన తరవాత చిన్న-చిన్న ఉండలుగా చేసుకోవచ్చును..... లేదా పెద్ద చపాతిలాగా వత్తుకొని, అంచు ఉన్న గ్లాస్ ఐనా, సీసా లేదా డబ్బాల మూతలు ఉన్నా చిన్న పూరీలుగా కట్ చేసుకోవచ్చును. అన్ని తయారుచేసుకున్నాక..... స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి, కాగిన తరవాత, 3 లేక 4 పూరీలను మాత్రమే నూనెలో వేస్తూ వేయించాలి. బాగా నూనె మరిగిపోకూడదు, అలాగని మరీ మంటను తగ్గించకూడదు. మీడియంలో మంటను ఉంచి పూరీలను వేయించాలి. నూనెలో వెయ్యగానే పూరీ బాగా పైకి పొంగాలి. ఈవిధంగా పూరీలను తయారుచేసి పక్కన ఉంచుకోవాలి. 


పానీపూరీలోకి పానీ తయారుచేయు విధానం
కొత్తిమీర - 1/2 కప్పు
పుదీనా - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 2
నల్ల ఉప్పు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడినంత

ముందుగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీ లో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకొని ఒక టీ గ్లాసు నీరు పోసి పలుచగా చేసుకోవాలి. ఈ పానీలో నల్ల ఉప్పు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. 

కూర తయారుచేయు విధానం 
సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
పచ్చిమిర్చి - 2 (చిన్న ముక్కలుగా చేసి ఉంచుకోవాలి)
టమాటా ముక్కలు- 1/2 కప్పు
ఉప్పు - రుచికి సరిపడినంత
కారం - 2 స్పూన్స్
పసుపు - చిటికెడు
జీలకర్ర పొడి - 1 స్పూన్
ధనియాల పొడి - 1/2 స్పూన్
ఛాట్ మసాలా - 1/2 స్పూన్
కొత్తిమీర తరుగు - 1/4 కప్పు
బఠాణీ - 1 కప్పు(పసుపు, ఉప్పు వేసి బాగా మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి)
బంగాళాదుంపలు - 2 (ఉడికించి తొక్కతీసి ఉంచుకోవాలి)   

ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 3 స్పూన్స్ నూనె వేసి, అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ఒక్కొక్కటిగా వేసుకుంటూ పచ్చివాసన పోయేటట్టు కొద్దిసేపు వేయించుకోవాలి, ఇప్పుడు మెత్తగా ఉడికించి పక్కన ఉంచుకున్న బఠాణీ వేసుకోవాలి, ఉడికించిన బంగాళాదుంపని చేతితో మెత్తగా చేస్తూ బాణలిలో వేసెయ్యాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ కొద్దిగా నీరు పోసి, జీలకర్ర పొడిని, ధనియాల పొడిని వెయ్యాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా తయారుచేసి ఉంచుకున్న పానీని రెండు గరిటలు కలిపి, మిశ్రమాన్ని మెత్తగా గరిటతో చేసుకోవాలి. అంతే పూరీలోకి కూర కూడా రెడీ.
   
ఇప్పుడు పూరీలలో తయారుచేసిన కూరని వేసి ఉల్లిపాయ ముక్కలని, కొత్తిమీరని వేసుకొని, పానీని పోసుకొని అమాంతం నోట్లో వేసీసుకోవటమే. అంతే కమ్మని Street Food ని మనం ఇంట్లోనే తయారుచేసుకొని తినెయ్యటమే.   
                     
                      

No comments:

Post a Comment