30.10.15

బ్రెడ్ వడ

బ్రెడ్ వడ 

కావలసిన పదార్థాలు 
బ్రెడ్ స్లైసులు  - 6
వంటషోడా - 1/4 స్పూన్
శెనగపిండి - 2 కప్పులు
కారం - 1 స్పూన్
ఉప్పు - రుచికి సరిపడినంత
నూనె - 1/4 Kg

తయారీవిధానం 
ముందుగా ఒక వెడల్పైన డిష్షులోకి శెనగపిండిని తీసుకోవాలి. అందులో ఉప్పు, కారం, వంటషోడా వేసి కొద్దికొద్దిగా నీరు పోస్తూ మరీ జారుగా దోసెలపిండి మాదిరిగా కాకుండా, కొద్దిగా చిక్కగా బజ్జీపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసులని తీసుకొని, అంచులని వేరుచేసి, క్రాసుగా, ట్రై ఏంగిల్ గా కట్ చేసి, పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి, కాగిన తరవాత బ్రెడ్ స్లైసెస్ లని ఒక్కొక్కటిని పిండిలో ముంచి, వడలుగా వెయ్యాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. అంతే కరకరలాడే కమ్మని బ్రెడ్ వడలు రెడీ. మీకు ఇష్టమైన చట్నీతో ఈ వడలని తినొచ్చును. (ఇష్టమైన వారు రెండు బ్రెడ్ ముక్కలకి మధ్యలో ఏదైనా గ్రీన్ చట్నీని, పెట్టి వడలు వేసుకోవచ్చు.) ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు చాలా తొందరగా, సులువుగా చేసుకునే స్నాక్ ఐటెం ఇది. మీరూ ట్రై చేస్తారు కదూ.         
              

బ్రెడ్ దహి వడ

బ్రెడ్ దహి వడ

కావలసిన పదార్థాలు
బ్రెడ్ స్లైసులు  - 6
మీగడ లేకుండా చిక్కగా చేసి ఉంచుకున్న పెరుగు - 1/2 కప్పు
క్యారెట్ తురుము - 1/4 కప్పు
పచ్చిమిర్చి ముక్కలు 1/4 కప్పు
మెత్తగా చేసి ఉంచుకున్న అల్లం - 2 స్పూన్స్
ఉల్లిపాయ తురుము - 1 కప్పు
బియ్యం (వరి) పిండి - 1 కప్పు
వంటషోడా - 1/4 స్పూన్
కొత్తిమీర తరుగు - 1/2 కప్పు
ఉప్పు - రుచికి సరిపడినంత
నూనె - 1/4 Kg

తయారీవిధానం
ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలోకి బియ్యం (వరి) పిండిని తీసుకోవాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వేసి, కొద్దికొద్దిగా నీళ్ళు పోస్తూ బాగా కలపాలి....ఇప్పుడు ఆ మిశ్రమంలో బ్రెడ్ స్లైసుల్ని మెత్తగా పొడిలాగా చేసుకొని వేసి, కొంచెం గట్టిగా వడలు వేసుకోవటానికి అనుకూలంగా ఉండేటట్టు బాగా కలపాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి, నూనె వేడెక్కిన తరవాత మిశ్రమం నుండి చిన్న ముద్దని చేతిలోకి తీసుకొని, అరచేతిలో వడలాగా వత్తుకొని, నూనెలో వేసి, బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. ఈవిధంగా అన్నీ చేసుకున్నాక, ఆ వడలని ఒక ప్లేటులోకి తీసుకొని, వాటిపైన పెరుగుని వేసి, కొత్తిమీర, క్యారెట్ తురుము, ఉల్లి తురుము వేసుకోవాలి. పెరుగులో కొద్దిసేపు వడలు నానిన తరవాత తినేయ్యటమే. కమ్మని, మెత్తని వడలు రెడీ. ఇష్టమైనవారు వడలు పైన సన్నని జంతికలు (మురుకులు) జల్లుకోవచ్చును.        


పాలకోవా

పాలకోవా 
పాలకోవా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ..... కోవాలు చేసుకోవటం చాలా ఈజీ ..... నేను చేశాను ....... ఎలా చెయ్యాలో చెబుతాను, మీరు ట్రై చెయ్యండి. 

కావలసిన పదార్థాలు 
పాలు - 2 లీటర్ల
పంచదార - 1 Kg
నెయ్యి - 1 స్పూన్

తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మందపాటి గిన్నె(ప్రెషర్ పాన్)లో పాలు పోసుకొని, స్టవ్ మంటని తగ్గించి, పాలు మీగడ కట్టకుండా, అడుగంటకుండా, దగ్గరపడేవరకు గరిటతో తిప్పుతూ ఉండాలి. పాలు దగ్గరికి అయ్యాక, పంచదార వేసి బాగా కలిపి, మళ్ళీ దగ్గరపడేవరకు అడుగంటకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. పాలు, పంచదార దగ్గరపడి చిక్కబడగానే ఆ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక పళ్ళెంలో వెయ్యాలి. మిశ్రమం కొంచెం చల్లారిన తరవాత చిన్న చిన్న బిళ్లలుగా చేసుకోవాలి. అంతే ఎంతో తియ్యని, కమ్మని పాలకోవాలు రెడీ.