14.4.14

వరిపిండి వడియాలు .... Varipindi Vadiyalu

వరిపిండి వడియాలు .... Varipindi Vadiyalu

కావలసిన పదార్థాలు
వరిపిండి (బియ్యంపిండి) -- 1 గ్లాసు
ఉప్పు - 1 స్పూన్
కారం - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
ఇంగువ - 1/4 స్పూన్
నీరు - 6 గ్లాసులు

తయారీవిధానం 
ముందుగా స్టవ్ వెలిగించి, ఒక వెడల్పాటి గిన్నెను పెట్టి, అందులో 4 గ్లాసుల నీటిని పోసుకుని, ఆనీటిలో ఉప్పు, కారం, జీలకర్ర, ఇంగువ వేసి బాగా మసిలించాలి. (కారం ఇష్టపడేవారు వారికి కావలసిన కారం వేసుకోవచ్చును.) వరిపిండిని 2గ్లాసుల నీటిలో కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు బాగామసిలిన నీటిలో వరిపిండి మిశ్రమాన్ని పోస్తూ కలుపుకోవాలి. మిశ్రమం కొంచెం చిక్కబడుతుంది. చిక్కబడగానే దించి, పక్కన పెట్టుకొని, చల్లారిన తరవాత ఒక పలుచటి కవరు మీద, స్పూన్ తో పిండిని వేసి పలుచగా అట్లపిండిని నెరిపినట్లు నెరపాలి. ఎంత పలుచగా మనం వడియాలు పెడితే, అంత త్వరగా ఎండుతాయి, రుచిగా ఉంటాయి. సాయంత్రం అయ్యేసరికి వడియాలు ఎండిపోతాయి. అంతే కరకరలాడే వరిపిండి వడియాలను వేయించుకొని తినటమే. (కవరుపై వడియాలను పెడితే ఎండాక తీసుకోవటానికి సులువుగా ఉంటాయి. అదే బట్టపై అరవేస్తే ఎండిన తరవాత తీసుకోవటానికి కొంచెం కష్టపడాలి. వడియాలు ఆరవేసిన బట్టని వెనుకకు తిప్పి నీరు చల్లితే వడియాలను తీసుకోవటం సులువు అవుతుంది.)                   

1 comment:

  1. ఇప్పుడే
    వడివడిగా
    వడియాలను
    వదిలెయ్యకుండా
    లాగించాలనుంది
    చెల్లీ +sweta vasuki

    ReplyDelete