15.2.14

చాక్లెట్ హార్ట్ కుకీస్

చాక్లెట్ హార్ట్ కుకీస్ 

కావలసిన పదార్థాలు 
వెన్న -- 100 గ్రా
మైదా -- 200 గ్రా
పంచదార -- 100 గ్రా

తయారీ విధానం 
ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని, అందులో వెన్న, పంచదార వేసి బాగా కలపాలి. తరవాత మైదా వేసి, మళ్ళీ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మీద మూతపెట్టి 15 నిముషాలు ఫ్రిజ్ లో ఉంచాలి. ఫ్రిజ్ నుండి బయటకు తీసాక, పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని, చపాతీలాగ వత్తుకొని, హృదయాకారపు నమూనాలతో కట్ చేసుకోవాలి.  వీటి పైన ఇష్టమున్నవారు బాదాం, జీడిపప్పు చిన్నముక్కలుగా చేసుకొని అలంకరించుకోవచ్చును. ఈ కుకీస్ ను నెయ్యిరాసి ఉంచుకున్న బేకింగ్ ట్రేలో ఉంచి, 200 డిగ్రీల సెంటీగ్రేడు వద్ద, 10 నిముషాలు ఉంచి బేక్ చేసుకోవాలి. బేక్ అయ్యిన తరవాత, బయటకు తీసి వాటికి చాక్లెట్ క్రీమ్ తో అందంగా అలంకరించుకుంటే చాలా బావుంటాయి. అంతే తియ్యటి లవ్లీ చాక్లెట్ హార్ట్ కుకీస్ రెడీ.

               

2.2.14

మసాలా పరోటా

మసాలా పరోటా 

కావలసిన పదార్థాలు 
గోధుమపిండి - 1/4 కేజీ
మైదా - 1/4 కేజీ
శెనగపప్పు - 1/4 కేజీ
పాలు - 1/4 లీటరు
అల్లం - చిన్నముక్క
జీలకర్ర - 2 స్పూన్స్
మిరియాలు - 1 స్పూన్
కారం - 1 స్పూన్
గరంమసాలా - 1/2 స్పూన్
సన్నగా తరిగిపెట్టుకున్న కొత్తిమీర - 1/2 కప్పు
నెయ్యి - 100 గ్రా
ఉప్పు - రుచికిసరిపడినంత

తయారుచేయు విధానం
ముందుగా ఒక బేసిన తీసుకొని అందులో గోధుమపిండి, మైదాపిండి, పాలు, ఉప్పు అన్నీ వేసి తగినంత నీరు పోస్తూ చపాతీపిండిలాగా మృదువుగా కలుపుకోవాలి. చివరిగా నూనె వేసి కలిపి, ఆ పిండిపైన తడిబట్ట కప్పి, అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఈలోగా స్టవ్ వెలిగించి, ఒక చిన్న కుక్కర్ తీసుకొని, అందులో శెనగపప్పును వేసి, బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలి తీసుకొని, అందులో జీలకర్ర, మిరియాలు సన్ననిమంటపై వేయించి తీసి, మిక్సీ లో మెత్తగా పొడిగా చేసుకొని, ఆ పొడిని, దంచిపెట్టుకున్న అల్లం ముక్కల్ని, కొత్తిమీర, కారం, ఉప్పు,  గరంమసాలా పొడిని అన్నీ పప్పులో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.                

పిండి నానినతరవాత, చిన్నచిన్న ఉండలుగా చేసుకొని, చపాతీలాగా వత్తుకొని, దానిమీద పప్పు మిశ్రమాన్ని కొంచెం ఉంచి, మూసేసి, చపాతీని నాలుగు మడతలు వేసి, మళ్ళీ మెల్లగా వత్తాలి. అలా అన్నీ వత్తి పక్కన పెట్టుకొని, స్టవ్ వెలిగించి, పెనం పెట్టి, ఒక్కొక్కటిగా పరోటాలను  నేతితో కాల్చుకోవాలి. అంతే కమ్మని రుచికరమైన మసాలా పరోటా రెడీ. ఇష్టమైన వారు నచ్చిన కూరలతో, సాస్ లతో  తినవచ్చును.