31.10.13

7 కప్పు స్వీట్

7 కప్పు స్వీట్ 

కావలసిన పదార్థాలు 
పచ్చికొబ్బరి తురుము -- 1 కప్పు
శెనగపిండి లేదా మైదాపిండి -- 1 కప్పు
పాలు -- 1 కప్పు
నెయ్యి -- 1 కప్పులు
పంచదార -- 3 కప్పులు
యాలకులపొడి -- 1/2 స్పూన్

తయారీవిధానం 
ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మందపాటి గిన్నె పెట్టి, అందులో పైన తెలిపిన పదార్థాలు అన్నీ వేసి, అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. కలపకుండా ఉంటే మిశ్రమం అడుగు అంటే అవకాశం ఉంది. మిశ్రమం కొద్దిగా దగ్గరపడ్డాక,  ఒక చిన్న బౌల్ లోకి నీరు తీసుకొని, అందులో ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేస్తే, ఉండ కట్టింది అంటే, కేకు తాయారు ఐనట్లే. ఇప్పుడు ఒక పళ్ళానికి నెయ్యి రాసుకొని, ఆ పళ్ళెంలో ఈ కేకు మిశ్రమాన్ని వేసి, సరిసమానంగా పరచుకొని, కొద్దిగా ఆరుతున్న సమయంలో, మనకు నచ్చిన ఆకృతిలో ముక్కలను కట్ చేసుకోవాలి. అంతే చాలా రుచికరమైన 7 కప్పు స్వీట్ రెడీ.  చాలా సులువుగా ఈ స్వీట్ ని తాయారుచేసుకోవచ్చును.

           

30.10.13

ఓట్స్ బర్ఫీ

ఓట్స్ బర్ఫీ 

కావలసిన పదార్థాలు 
ఓట్స్ -- 1 కప్పు
జీడిపప్పు -- 1/2 కప్పు
పంచదార -- 3/4 కప్పు
నెయ్యి -- 3 స్పూన్స్
యాలకులపొడి -- 1 స్పూన్
బాదం పప్పు లేకపోతె జీడిపప్పు -- 10 (చిన్నగా ముక్కలు చేసుకోవాలి)

తయారీ విధానం 
ఓట్స్ ను పొడి చేసి ఉంచుకోవాలి, జీడిపప్పును మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలిపెట్టి, ఓట్స్ పొడిని, జీడిపప్పు పొడిని దోరగా, విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో పంచదార వేసి, తగినన్ని నీళ్ళు పోసి, పలుచని తీగపాకం రానివ్వాలి. పాకం వచ్చిన తరవాత, అందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకొన్న ఓట్స్ జీడిపప్పు పొడులను, యాలకుల పొడిని అన్నీ కలిపి పాకంలో వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గర అయ్యాక ఒక ప్లేట్ కి నెయ్యి రాసి, ఆ ప్లేట్ లో ఈ మిశ్రమాన్ని వేసి, దానిపైన బాదాం(జీడిపప్పు)  ముక్కలను సర్ది,  కొంచెం చల్లారక మనకి నచ్చిన ఆకారం లో ముక్కలు కోసుకోవాలి. అంతే  తియ్యని ఓట్స్ బర్ఫీ రెడీ.

         

28.10.13

పల్లీ (వేరుశెనగ పప్పు) లడ్డు

పల్లీ (వేరుశెనగ పప్పు) లడ్డు 

కావలసిన పదార్థాలు 

వేరుశెనగపప్పు (పల్లీలు ) -- 1 కప్పు
బెల్లం తురుము -- అరకప్పు
కొబ్బరి ముక్కలు -- 1/4 కప్పు (సన్నగా తరిగి ఉంచుకోవాలి)
యాలకులపొడి -- 1/4 స్పూన్
నెయ్యి -- కొద్దిగా

తయారీ విధానం:--

ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, పల్లీలు వేయించి, పొట్టుతీసి, మిక్సీలో బాగా మెత్తగా పొడి చేసి  ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి, కొబ్బరి ముక్కలని దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. తరవాత ఒక మందపాటి గిన్నెలో బెల్లంతురుము వేసి, దానికి సరిపడ నీరు చేర్చి, పాకం వచ్చేవరకు, అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. పాకం వచ్చిందో లేదో చూడాలంటె, చల్లటి నీటిలో పాకాన్ని ఒక చుక్క వేస్తె, ఉండకట్టాలి, అలా ఉండకట్టింది అన్నాక, కొబ్బరితురుము, యాలకులపొడి, పల్లీలపొడి వేసి బాగా కలిపి, స్టవ్ మీదనుండి దించెయ్యాలి. కాస్త చల్లారిన తరవాత,  చేతికి వేడి పట్టేటట్టు ఉంటే ఉండలు చుట్టుకోవాలి. అంతే  కమ్మని, నోటిలో వేసుకుంటే కరిగిపోయే పల్లీల ఉండలు రెడీ.


కొబ్బరి పాయసం

కొబ్బరి పాయసం

కావలసిన పదార్థాలు:--

పాలు -- 1/2 లీటరు
కొబ్బరి తురుము -- 1 కప్పు
యాలకుల పొడి -- 1/2 స్పూన్
పంచదార -- 1/4 కేజీ
కిస్ మిస్ -- 2 స్పూన్స్
జీడిపప్పు -- 3స్పూన్స్
బాదంపప్పు -- 2 స్పూన్స్
నెయ్యి -- 2 స్పూన్స్
సగ్గుబియ్యం -- 1/4 కప్పు (10 నిముషాలు ముందు ఉడికించి పక్కన పెట్టుకోవాలి)

తయారీ విధానం:--

ముందుగా  స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్ మిస్ , బాదం పప్పు లను వేరువేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో పాలుపోసి, బాగా మరిగిన తరవాత పంచదార వేసి.... అందులో కొబ్బరి తురుము, ముందుగా ఉడికించి పక్కనపెట్టుకున్న సగ్గుబియ్యం, అన్ని వేసి బాగా మరిగించి, దించేముందు యాలకులపొడిని వేసి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాయసంలో వేయించి పక్కన ఉంచుకున్న .. జీడిపప్పు, కిస్ మిస్, బాదంపప్పు  వేసుకోవాలి. అంతే తియ్యని కమ్మని కొబ్బరి పాయసం రెడీ.




       

రైస్ వడ

రైస్ వడ 

కావలసిన పదార్థాలు:
ఉడికించిన అన్నం -- 2 కప్పులు (కొంచెం మెత్తగా ఉడికించిన అన్నం)
కొబ్బరి తురుము -- 1 కప్పు
పెరుగు -- 1 కప్పు
కారం పొడి -- 1 స్పూన్
అల్లం పచ్చిమిర్చి పేస్టు -- 2 స్పూన్స్
క్యాబేజీ తురుము -- 1/4 కప్పు
క్యాప్సికం తురుము -- 1/4 కప్పు
టమాటా ముక్కలు -- 1/4 కప్పు
మైదాపిండి -- 3 స్పూన్స్
కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు --- తగినంత
నూనె -- 1/4 కేజీ

తయారీ విధానం:--

ముందుగా ఒక వెడల్పాటి డిష్ లో  పెరుగువేసి,  అన్నము ఇంకా మిగిలిన పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి, బాగా మెత్తగా కలిపి (గారెల పిండి వలె ఉండాలి) పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి, అన్నం మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని, వడల మాదిరిగా వేసి, ఎర్రగా రెండు వైపులా కాలిన తరవాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇష్టమైన వారు వారికి నచ్చిన చట్నీతో తినవచ్చును. అంతే కమ్మని రైస్ వడ రెడీ.

(చిన్న చిట్కా----- మనకి అన్నం ఎప్పుడైనా మిగిలినట్లు ఐతే, పిల్లల్ని తినమంటే తినరు కాబట్టి, ఇలాగ వడలు వేసి ఇవ్వవచ్చును. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చిన చాలా త్వరగా ఈ వడలను చేసి సర్వ్ చేయవచ్చును.)

              

     

21.10.13

పొట్లకాయ తిమ్మనం

పొట్లకాయ తిమ్మనం

కావలసిన పదార్థాలు
బియ్యపు పిండి -- 3 స్పూన్స్
పొట్లకాయ ముక్కలు -- 1 కప్పు (ఉడికించినవి)
కొబ్బరి -- 4 స్పూన్స్
పాలు -- 1/2 లీటరు
పంచదార -- 1/4 కేజీ
జీడిపప్పు -- 50 గ్రా
కిస్ మిస్ -- 25 గ్రా
యాలకులపొడి -- 1 స్పూన్
నెయ్యి -- 2 స్పూన్స్

తయారీ విధానం:--

ముందుగా  బియ్యంపిండిని, కొబ్బరిని మిక్సీలో మెత్తగా రుబ్బి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెలో పాలుపోసి మరిగించి, పంచదార వేసి పాలను బాగా మరిగించాలి. ఇప్పుడు రుబ్బి ఉంచుకున్న కొబ్బరి + బియ్యపుపిండి మిశ్రమాన్ని మరియు ఉడికించి ఉంచుకున్న పొట్లకాయ ముక్కలని వేసి సన్నటి సెగ మీద 10 నిముషాలు ఉడకనివ్వాలి. కొంచెం చిక్కబడే సమయానికి దించెయ్యాలి. ఇప్పుడు ఒక చిన్న బాణలిలో నెయ్యి వేసి... జీడిపప్పు + కిస్ మిస్ లను దోరగా వేయించి తిమ్మనంలో వేసుకుని, యాలకులపొడిని కూడా కలిపుకోవాలి. అంతే తియ్యటి తిమ్మనం రెడీ. ఈ తిమ్మనంలో అట్లను నంజుకొని తింటే చాలా బావుంటుంది.



అట్లతద్ది అట్లు

అట్లతద్ది అట్లు 

కావలసిన పదార్థాలు:--

మినప్పప్పు -- 1 కప్పు
బియ్యం -- 2 కప్పులు
ఉప్పు -- తగినంత
జీలకర్ర -- 1 స్పూన్
నూనె -- తగినంత

తయారీ విధానం:--
మినప్పప్పు & బియ్యం 4 గంటలు ముందుగా నానబెట్టి, రుబ్బుకుని, ఉప్పు & జీలకర్ర కలిపి 8 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, పెనం (pan) పెట్టుకొని, వేడి ఎక్కిన తరవాత నూనె రాసి, అట్టుని వేసుకొని, దోరగా కాలిన తరవాత తీసేయ్యటమే. పిండిని కొంచెం గట్టిగా రుబ్బుకుంటే, పెనం మీద వేసేటప్పుడు గట్టిగా రుద్ది అట్టుని వేస్తె అట్టు మృదువుగా వస్తుంది. అంతే ఎంతో రుచిగా ఉండే అట్లతద్ది అట్లు రెడీ....నోము నోచినవాళ్ళు ఇలాగ అట్లు వేసుకొని తింటారు. ముత్తైదువులకు వాయనం ఇవ్వటానికి చిన్న చిన్న అట్లని వేసి ఇస్తారు. ఈ అట్లని బెల్లం పాకంతో కానీ, తిమ్మనంతో కానీ తింటే బావుంటుంది. 


10.10.13

కూరగాయల అన్నం

కూరగాయల అన్నం (Mixed Vegetable Rice)

కావలసిన పదార్థాలు:--

క్యారెట్ ముక్కలు -- 1/4 కప్పు
క్యాప్సికం ముక్కలు -- 1/4 కప్పు
టమాట ముక్కలు -- 1/4 కప్పు
పచ్చిబఠాణీ -- 1/4 కప్పు
వంకాయముక్కలు -- 1/4 కప్పు
బెండకాయ ముక్కలు -- 1/4 కప్పు
తీపిగుమ్మిడి ముక్కలు -- 1/4 కప్పు
కరివేపాకు & కొత్తిమీర -- కొద్దిగా
కందిపప్పు -- 1/2 కప్పు
బియ్యం -- 2 పావులు  
చింతపండుగుజ్జు -- 1/4 కప్పు
పోపుదినుసులు -- తగినంత
ఉప్పు -- రుచికి సరిపడినంత
నూనె -- 1/4 కేజీ

తయారీవిధానం:--

ముందుగా బియ్యాన్ని కడిగి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనెవేసి, పోపుదినుసులు వేసి, వేగినతరవాత  కూరగాయ ముక్కల్ని, కరివేపాకు & కొట్టిమీరని  ఒక్కొక్కటిగా వేసి, కడిగిన కందిపప్పును, బియ్యాన్ని, తగినంత ఉప్పును, చింతపండుగుజ్జును వెయ్యాలి. అన్నీ వేసిన తరవాత బాగా కలియబెట్టి, 4 పావులు  నీళ్ళు పోసి, మిగిలిన నూనెను వేసి, కుక్కరు మూతపెట్టి, 5 విసెల్స్ వచ్చేవరుకు ఉంచి దించుకోవాలి. అంతే రుచికరమైన  కూరగాయల అన్నం రెడీ.        

రవ్వకేసరి

రవ్వకేసరి 

కావలసిన పదార్థాలు:--
గోధుమనూక (బొంబాయి రవ్వ) -- 1/2 కేజీ
పంచదార -- 1/2 కేజీ
నెయ్యి -- 1/4 కేజీ
జీడిపప్పు -- 50 గ్రాములు
కిస్ మిస్ -- 50 గ్రాములు
కేసరి రంగు -- చిటికెడు
పాలు & నీళ్ళు -- 1 లీటరు
యాలకులపొడి -- 1 స్పూన్

తయారీవిధానం:--
ముందుగా  గోధుమనూకని వేయించి పక్కనపెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నెను తీసుకొని, 1  లీటరు పాలు నీళ్ళుపోసి, బాగా మరిగిన తరవాత, గోధుమనూక.... పంచదార, యాలకులపొడిని  కలిపి మసిలిన నీటిలో వేసి, కేసరి రంగును చిటికెడు వేసుకోవాలి. బాగా దగ్గరపడిన తరవాత, దించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యివేసి జీడిపప్పు & కిస్ మిస్ ని దోరగా వేయించి కేసరిలో కలపాలి. అంతే  తియ్యని.... కమ్మని రవ్వకేసరి రెడీ.

           

(చిల్లులు లేని) అల్లం గారెలు

(చిల్లులు లేని) అల్లం గారెలు

కావలసిన పదార్థాలు:--
మినప్పప్పు -- 1/2 కేజీ
అల్లం -- 100 గ్రాములు
పచ్చిమిర్చి -- 50 గ్రాములు
జీలకర్ర -- 2 స్పూన్స్
కొత్తిమీర & కరివేపాకు -- కొంచెంగా 
నూనె -- 1/2 కేజీ
ఉప్పు -- తగినంత

తయారీవిధానం:--
గారెలు చేసే 2 గంటల ముందుగా మినప్పప్పుని నానబెట్టాలి. నానిన తరవాత నీళ్ళు తక్కువగా పోసి, గారెలపిండిలాగ గట్టిగా రుబ్బుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి ముద్దలాగా చేసుకొని కలుపుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె పోసి గారెలపిండిని తీసుకొని చిల్లులు లేకుండా వడలులాగా వేసుకోవాలి. దోరగా వేయించి తీసుకోవాలి. అంతే వేడివేడి కమ్మని అల్లం గారెలు రెడీ.              


కొబ్బరి అన్నం

కొబ్బరి అన్నం 

కావలసిన పదార్థాలు:--

బియ్యం -- 1/2 కేజీ
కొబ్బరి తురుము -- 4 కప్పులు
జీడిపప్పు -- 50 గ్రాములు
నెయ్యి -- 50 గ్రాములు
ఏలకులు -- 4
లవంగాలు -- 4
దాల్చినచెక్క -- 4 ముక్కలు
పచ్చిమిర్చి -- 5 (చీలికలు చేసుకోవాలి) 
కరివేపాకు -- తగినంత
పల్లీలు -- 4 స్పూన్స్
ఉప్పు -- తగినంత

తయారీవిధానము:--
ముందుగా బియ్యం కడిగి పక్కన ఉంచుకోవాలి,  కొబ్బరితురుమును మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసి, పాలను తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్రను పెట్టి, కొద్దిగా నెయ్యి వేసి, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, జీడిపప్పు,  పల్లీలు, పచ్చిమిర్చి వేసి వేగిన తరవాత కొబ్బరిపాలు పోసి, కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసి, తగినంత ఉప్పు వేసి, మూతపెట్టి, ఉడికేంతవరకు ఉంచి, దించుకోవాలి. అంతే కమ్మని కొబ్బరి అన్నం రెడీ.

               

9.10.13

మినపసున్ని ఉండలు

మినపసున్ని ఉండలు 
కావలసిన పదార్థాలు:--

మినప్పప్పు  --  కేజీ
పంచదార --  కేజీ లేదా బెల్లం
బియ్యం --  1 కప్పు
నెయ్యి : 1/2 కేజీ

తయారీవిధానం:--

ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, మినప్పప్పుని దోరగా వేయించి పక్కనపెట్టుకోవాలి. కొంచెం చల్లారాక బియ్యాన్ని, మినప్పప్పుని  మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పంచదారని కూడా మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక గిన్నెలో నెయ్యిని వేసి కరిగించి,  మినపపొడి మీద వేసి బాగా కలిపి, మనకు  కావలసినట్టు ఉండలు చుట్టుకోవాలి.  అంతే నోట్లోవేస్తే కరిగిపోయే మినపసున్ని ఉండలు రెడీ.

       

రవ్వలడ్డు (కొబ్బరి లస్కోరా)

రవ్వలడ్డు (కొబ్బరి లస్కోరా)

కావలసిన పదార్థాలు:--

బొంబాయి రవ్వ(గోధుమనూక) -- అరకేజీ
పంచదార -- అరకేజీ
నెయ్యి -- 1 కప్పు
యాలుకల పొడి -- 1  స్పూన్
కొబ్బరి పొడి -- 1 కప్పు
జీడిపప్పు & కిస్మిస్  -- 1/4 కప్పు

తయారీవిధానం:--

ముందుగా స్టవ్ వెలిగించి,బాణలి పెట్టి,  నెయ్యి వేడిచేసి, రవ్వను దోరగ వేయించి, ఒక పళ్ళెంలో వేసుకోవాలి. బాణలిలో కొంచెంగా నెయ్యివేసి, జీడిపప్పు & కిస్మిస్ ని వేసి దోరగా వేయించి, నూకమీద వెయ్యాలి. వెంటనే  వేడి రవ్వలో పంచదార, కొబ్బరి పొడి, యాలుకల పొడి కలిపి రెండు నిముషాలు ఉంచాలి.రవ్వ వేడికి పంచదార కరిగి కొద్దిగా తడి అవ్వుతుంది. ఇప్పుడు మిశ్రమాన్ని అంతా బాగా కలిపి, మనకి నచ్చిన సైజులో  ఉండలు చుట్టుకోవాలి. అంతే తియ్యనైన రవ్వలడ్డు (కొబ్బరి లస్కోరా)  రెడీ.





చింతపండు పులిహోర

చింతపండు పులిహోర

కావలసిన పదార్థాలు
పొడిపొడిగా వండిన అన్నం -- 4 కప్పులు 
చింతపండు గుజ్జు -- పావు కప్పు 
పచ్చిమిర్చి -- 6(నిలువుగా చీల్చి ఉంచుకోవాలి)
ఎండుమిర్చి -- 3
పోపుదినుసులు --  తగినన్ని(మినప్పప్పు , శెనగపప్పు , ఆవాలు, కొంచెంగా మెంతులు )
వేరుశెనగ పప్పు (గుళ్ళు) -- పావుకప్పు 
కరివేపాకు రెబ్బలు -- కొద్దిగా 
పసుపు & ఉప్పు --  రుచికి తగినంత  
ఇంగువ -- 1/2 స్పూన్ (ఇష్టమైతే మరికొంచెం వేసుకోవచ్చును)
నూనె -- 1 కప్పు 

తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించుకొని, బాణలి పెట్టి, కొద్దిగా నూనె వేసి చింతపండుగుజ్జులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి చింతపండు దగ్గరపడేవరకు మగ్గించి, పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మల్లి బాణలి పెట్టి నూనెవేసి, పోపుదినుసులు, వేరుశెనగగుళ్ళు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, అన్నీ వేసి బాగా వేగాక కొంచెం పోపును తీసి పక్కన పెట్టుకోవాలి, మిగిలినపోపులో మగ్గించి పక్కనపెట్టుకున్న చింతపండుగుజ్జును వేసి, 5 నిముషాలు ఉంచి, దించి ఒక బేసనలో ఉంచుకొన్న అన్నం మీద పోపుని, చింతపండుతో కలిసిన పోపుని వేసి బాగా కలియబెట్టాలి. అంతా కలిసాక పైన మిగిలిన నూనెను వేసి మరొక్కసారి కలపాలి.  అంతే కమ్మని వాసనగల చింతపండు పులిహోర రెడీ.

పండుగనాడు ప్రతీఒక్క ఇంట్లోను చేసుకొనే ప్రసాదములలో ఇది ముందుగా ఉంటుంది. ఎందుకంటే పర్వదినాలలో పసుపుఅన్నం తప్పనిసరిగా చెయ్యాలని ..... అందరూ చేస్తారు.